15, జనవరి 2016, శుక్రవారం

కవిత్వం

భార్య

.......................
ట్రిబ్యూట్ టు ఏ ...వయిఫ్
.............
పురాతన శిథిల మానవ సమూహాల్లోంచి
ఓ ఆధునిక దివ్య మంత్రంలా
తాపసీక ..స్రుష్టి రహస్య అణువులన్నీ కూచోని
అస్థిత్వం కోసం పోరాడుతున్నఫ్ఫుడు ..
కనిపించని దివా..రాత్రి ..గతాల
అజ్ఞాతంలోంచి పుట్టిన...
యుగాల దాహార్తుల్లోంచి..మాత్రు బొధనల్లోంచి
పవిత్రత ..సవుశీల్యతలని
ఒక తరాన్నించి...మరో తరానికి
కానుకగా...జ్ఞాన సంపదగా ..దయివ్జాజ్ఞగా అందివ్వటానికి...
ఓ కొత్త ఊదారంగు ఆకాశంలా ..
ఓ కొత్త దివ్య గంధ పరిమళంలా..
అరి చేతిలో కురుస్తున్న తొలకరి కొత్త వానలా
అలా..అలా..అలా ..
నువ్వు పెళ్ళి పందిరిలోకి
అడుగు పెట్టావు .
శివధనుర్భంగానికి ముందు
సీతాదేవి రాముణ్ణి చూసిన తొలి చూపులా
జిలకర్ర ..బెల్లం నా తలమీద పెడుతూ
నువ్వు ..నా వయిపు చూసిన చూపుని
నిర్వచించి..వర్ణించటానికి ..నాదెగ్గిర మాటలు లేవే..
ఆ చూపులో..
వంద రకాల విద్యుత్ ఘాతాలు
ఆ చూపులో..
వంద రకాల..విద్యుత్ న్మాలలు.
అప్పుడే మలిసారి పుట్టిన
రెండు కొత్త శరీరాలమధ్య
అల్పపీడనం పుట్టినట్లు..
ఎంత వత్తిడి?ఎంత వత్తిడి?
పెళ్ళి సంకెళ్ళు వేసిన కొత్త బంధాల్లో
నీళ్ళయిపోయిన శరీరాలమీద
ఓడలు పరుగెత్తుతున్నట్లు
ఎంత బరువు?ఎంత బరువు?
చెప్పలేని అంతరంగ సందిగ్ధాలల్లో
చెట్లు మొలిచిన శరీరం మీద
సంజెవేళల్లో పక్షుల పాద ముద్రలని
మేల్కోని కనే కలలో
చిత్రంగా చూస్తున్నట్లు..భ్రమించటం
ఎంత స్రుష్టి వయిచిత్రం?
2 ..
నా లోపలి సముద్రపు హోరు
నాకే వినపడుతున్నఫ్ఫుడు ...
నాలోపలి తుఫాను రొద
నాకే తెలుస్తున్నప్పుడు..
శరీరం ..తెరుచుకున్న కిటికీలోంచి
ఒక ఒంటరి రెక్కల పక్షి నక్షత్రంలా ..
నా గదిలోపలి కొచ్చావు .వాలిపోయావు .
కలగన్న స్రుష్టి రహస్యాలన్నీ
ఒక్కసారే చేసిన దాడిలో..
ఇద్దరమూ గాయపడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో ఖేద పడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో మోద పడ్డాము..
మొదటిరాత్రి..మనమున్న గది
స్రుష్టికర్త ప్రశ్న పత్రం అయ్యింది.
కుప్పబోసిన...అవ్యక్తాల్లోంచి
శరీరాలు నిర్వచనా లయ్యాయి
శరీరాలు జవాబులుగా కూడా మిగిలిపొయాయి.
3
మూడు ముళ్ళు ..ఏడు అడుగులు
ఒక్క రాత్రితో నేను..నీకు..
కొత్త ఇల్లుగా మారాను.
నువ్వు..నా నా కొత్త ఇంటికి
శుభ సూచకంగా పెట్టిన దీపంగా వెలిగావు.
నేను...నువ్వు పక్క మీదనించి లేస్తూనే
కళ్ళకద్దుకునే తాళిబొట్టు నయ్యాను.
నువ్వు వేసే ప్రతి అడుగులో నేనున్నానంటూ
నీ కాలికి మట్టెలు గా మారాను.
నువ్వు చేసే ప్రతి పనిలో నేనున్నానంటూ
నీ చేతులకి గాజులుగా మారాను.
ప్రపంచం చూసే నీ నుదుటన
నేనున్నానంటూ నీ బొట్టుగా మారాను.
రేపటి ..దేశం కంటున్న భవిష్యత్తుగా
చూస్తుండగానే తల్లిగా ..నువ్వు..
మన.. స్త్రీ పురుషుల జంటకి గుర్తుగా కొత్త జెండా నెగరేశావు.
ప్రపంచంలో..నా..కొత్త వారసత్వనికి.
నన్ను మూలపురుషుణ్ణి చేశావు..
4
గడ్డ కట్టిన ఓ అభేద్య నిశ్శబ్దంలో
పురుడు పోసుకోవటం అంటే
నువ్వు చచ్చి బ్రతకటమే కదూ..
అమ్మ కడుపులోంచి..కొత్త ప్రాణి
బయటి ప్రపంచానికి నిష్క్రమించటమే కదూ ..
ఆసుపత్రి బయట క్రూర నిరీక్షణల అనంతరం
మన ..ఇద్దరి..వారసత్వాన్ని
గుప్పిళ్ళల్లో..గట్టిగా ..బిగించి పట్టుకుని
నిద్దర బోతున్న
ఓ అందమయిన మానవపువ్వులా
మనబాబు...
ఓ అందమయిన వెల్తురు పక్షిలా
మన బాబు ..
నువ్విచిన నీ ..కానుకేగా నాకు..
5
అదే పురిటి వాసన ..
అదే ఆముదం వాసన..
అదే సాంబ్రాణి వాసన..
అదే పాలు తాగే బాల వాసన
తల్లిగా ..నిన్ను చూసినప్పుడల్లా
పాతచీర ..గుడ్డ ఉయ్యాలలో
నన్ను మాసాల పసిబాలుణ్ణి చేసి
జోలపాడుతూ ..లాలి పాడుతూ..
నన్ను కన్న తల్లి ..మరోసారి..భార్య ..నీ..రూపంలో ..
నన్ను నిద్ర బుచ్చటానికొచ్చినట్లు కనిపిస్తుంది.
నీకంటూ ..నీకు నువ్వు ఏమీ మిగుల్చుకోకుండా
నీ ఇంటి పేరు కూడా మార్చేసుకున్నావు.
వేడి అన్నం మీద పడ్డ ..వెన్న ముద్దలా
నీ..నెత్తురు వెచ్చించి..
మా జీవితాల అగ్గిలో కరిగిపోయావు.
శుక్రవారం నాకంటే ముందే లేచి తలంటు పోసుకున్న
నా కొత్త ఉదయాని వయ్యావు.
శని వారం రోజున
నా ఒక్క పొద్దువి కూడా అయ్యావు .
ఇంటి ముందు పూల చెట్టువయ్యావు.
రోటి దెగ్గిర పచ్చడివయ్యావు .
పొయ్యిదెగ్గిర బొగ్గుగా మారిన కట్టె ముక్క వయ్యావు
దాహాని తీర్చేందుకు మట్టికుండగా మారావు
పండగ రోజున ..నాకూ ..పిల్లలకు..
కంచాల్లో పరవాన్నం అయ్యావు.
అమ్ముమ్మ వయ్యావు ..నానమ్మ వయ్యావు.
మనుమళ్ళకు..మనుమ రాళ్ళకు
కథలు చెప్పే చందమామ పుస్తకమయ్యావు .
6
జీవితం ...కత్తుల వంతెనమీద
నేను చేస్తున్న యుద్ధంలో..
యెప్పటికీ ఖాళీ కాని అమ్ముల పొదిలాగా
మారిపోయిన నీకు ..
నేను..క్రుతజ్ఞతలు మాటల్లో చెప్పాలంటే ..
నాకు రావణాసురుడిలా పది తలలు కావాలి.
చేతులు మోడించి క్రుత్జతలు చెప్పాలంటే
ఇరవయి చేతులు కొత్తగా మొలవాలి.
దేహం నించి..దేహానికి సాగిన ప్రయాణం అల్లా..
రూపాన్ని మార్చుకోని
ఆత్మ నించి ఆత్మకు ప్రయాణం
గా రూపాంతరమయ్యింది.
జీవితాన్ని నిర్వచించిన
నిబంధనలన్నీ చూస్తుండగానే గాలిలో కలిసిపోయాయి
బతుకు పోరులో ఎదురయిన
సంకెళ్ళన్నీ చూస్తుండగానే ముక్కలుగా విరిగిపొయాయి.
ముసలితనం తెచ్చిన స్వేచ్చలో
కాటికి కాళ్ళు జాపుకోని ..
ఏ బాదర బందీలేకుండా
చావుకోసం ఎదురు చూడటం
ప్రతిమనిషికీ ఆఖరి దశలో ఎదురయ్యే ఎంతటి నిత్య సత్యం??
7
ఎవరో వస్తున్నారు..ఎవరో వెళ్తున్నారు..
ఎవరో నన్ను..మంచం మీదనించి కింద పడుకోబెట్టమంటున్నారు ఏవేఓ అస్పస్ట ద్రుశ్యాలు..అస్పస్ట వాసనలు
అదిగో ..నా భార్య ..కొత్తపెళ్ళికూతురుగా వస్తున్నది..
అదిగో ..మా అమ్మలాగే ..నాకు అన్నం తినిపిస్తున్నది..
నా కొడుకులు..కోడళ్ళు వద్దు వద్దు..
అది ఎక్కడున్నది?ఎమేవ్?ఒసేయ్..ఎక్కడున్నావు..
నాకు అమ్మ వాసన వస్తున్నది
నాకు భార్య వాసన వస్తున్నది..
ఎవరో తులసితీర్ధం పోయమంటున్నారు..వినపడుతున్నది..
అతికస్టం మీద చూస్తే నా భార్య ..ముసలిది..ఏడుస్తూ.
నా నోరు తెరిచి నీళ్ళు పోస్తున్నది.
ఏడ్వబాకే ..ఏడవ బాకు ..
నీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నాను.
వచ్చే జన్మంటూ ఉంటే..
నీకు కొడుకుగా పుట్టి ..
నీ పయిట చెంగుతో ఆడుకుంటూ ...నీ పాదాలదెగ్గిర అంబాడుకుంటూ
ఈ జన్మలో భార్య రుణం ..
వచ్చేజన్మ లో అమ్మ ..రుణం..
ఒక్కసారే తీర్చుకుంటాను .
..................................................................

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి