16, జనవరి 2016, శనివారం

సాహిత్యం


 వీటినన్నిటినీ ప్రశ్నిస్తున్నట్టు కలర్ ఇవ్వండి


మీరు మెధావులుగా ..సమాజం లో గొప్పవాళ్ళుగా ..అభ్యుద్యవాదులుగా ..పేరు తెచ్చుకోవాలనుకుంటున్నారా?
మీడియాలో ..గొప్పవాడిగా .."కొత్త దేవుడిగా"కొలువొందాలనుకుంటున్నారా?
ెరీ సింపుల్ ..చాలా ఈజీ..డాక్టరేట్ సంపాయించటానికయినా కొన్నాళ్ళు కస్టపడాలి కాని ..మేధావి అభ్యుదయవాది అనిపించుకోవటానికి మాటలను అటు తిప్పి ఇటు.....ఇటు తిప్పి అటు మార్చి తెలివిగా మాట్లాడగలిగితే చాలు.
ముందుగా నేను నాస్తికుణ్ణి అని ప్రకటించాలి.
తరువాత దేవుడు లేదు అనాలి. అటు తరువాత్..రామాయణం రంకు ..భారతం బొంకు అనాలి .హిందువులందరూ ఎధవలు అనాలి.
చుట్టూ ఉన్న ..హిందువులని..వాళ్ళ నమ్మకాలని..వాళ్ళ అస్థిత్వాన్ని కనపడ్డ ప్రతి వేదిక మీద ఎగతాళి చేయాలి.
దేశం ..దేశభక్తి అని మాట్లాడే ప్రతివాణ్ణి ..ఆర్ ఎస్సెస్ వాడు మతోన్మాది.. అని ముద్రవేయాలి.
బ్రాహ్మణులని ..సామాజ ద్రోహులు అనాలి .మనువాదం అనాలి. బ్రాహ్మణవాదం అనాలి.అగ్రవర్ణాలు అని..మీరు ..మీ వర్గం తప్ప అన్ని వర్గాలమీద దుమ్మెత్తి పోయాలి.
ఇలా కొన్ని సార్లు చేస్తే చాలు..మీవెనక కొంత మంది కమ్యూనిస్టులు చేరతారు .మీకు గొడుగులు పడతారు .అలాగే సహజంగా హిందువులైవుండి..మతం మారిన....రిజర్వేషన్ల పేరుతో ..ఉద్యోగాలు సంపాయించికూడా ..ఇరవయి నాలుగ్గంటలూ ..హిందూఇజం ..మీద రాళ్ళేసే ..అన్య మతస్థులు కూడా మీరు అడక్క పోయినా ..మిమ్మల్ని వాళ్ళల్లో కలుపుకోని..మీకు సన్మానాలు చేస్తారు .మీకు గొడుగులు పడతారు
మయినారిటీ ..మద్దతుగా ..గొడ్డుమాసం తింటే తప్పేంటి అనాలి.యజ్ఞ యాగాల్లో పశు బలు లు లేవా అనాలి
స్వెచ్చ అనాలి.
స్వాతంత్రం అనాలి.
సెక్యూలరిజం అనాలి
హిందూ మతాన్ని ఎంత అవమానిస్తే ..అంత గొప్పవాళ్ళయిపొతారు.
దీంట్లోనే ..ఉచ్చ పోయటం ..పురాణ సాహిత్యాన్ని నిప్పు పెట్టటం..పుష్కరాలు..వినాయకుడు పాలు తాగటం ..ఇంకా చాలా ఉన్నాయి.
ఎందుకు ..?అని వీటినన్నిటినీ ప్రశ్నిస్తున్నట్టు కలర్ ఇవ్వండి
........
మీరు గొప్పవాళ్ళయిపోతారు
ఏదాది తిరిగేసరికి ..మీకు గవురవ డాక్టేరేట్..వచ్చినా అస్చర్య పోనక్కరలేదు.
మిమ్మల్ని ఎవరైనా తిట్టినా ..విమర్సించినా..గుర్తు పెట్టుకొండి వాళ్ళు చాందసవాదులవుతారు .మతోన్మాదులవుతారు .ఆరెస్సెస్..అవుతారు

Pisaasu Movie Official Song

15, జనవరి 2016, శుక్రవారం

సమీక్షలు

నేటితరానికి మరో మహాప్రస్థానం ఈ.."మంత్రలిపి"కవితాసంపుటి 
...................................................
శ్రీశ్రీ తన మహా ప్రస్థానం సాగిస్తున్నప్పుడు "హరోం ! హరోం హర ! హర హర హర హర" అంటూ ఒక చిన్న బీజాక్షర మంత్రాన్ని ఉపదేశేసిస్తే , ఆబీజాక్షరానికి విస్తృతిని ఇచ్చి, దాన్ని విడమర్చి లిఖించిన పరిపూర్ణ మంత్రమె, కొనకంచి ఈ మంత్రలిపి.ఈయన ప్రతి కవిత ఒక నిజం.మనం తట్టుకోలేనంత నిజం.
అబద్దానికి అలవాటు పడిపొయి అదే నిజం అనే ఒక భ్రమతో ఆ అబద్దపు ప్రపంచంలో నిజం వెతుక్కొవటానికి ప్రయత్నం చేస్తూ ..వేలకు వేలఅబద్దాలలో మనకు నచ్చిన ఒక అబద్దాన్ని నిజం అనుకొనే అబద్దపు బ్రతుకులు బ్రతుకున్న మనకు నిఖార్సైన నిజం చూసినప్పుడు అదినిజం అనుకొనే ధైర్యం ఉండదు .అసలు దాన్ని నిజం అని గుర్తించే అవకాశం ఉండదు.అసలు ఆ నిజం ఉంటుంది అనే విషయం కూడా తెలియదు. కొనకంచి గారు ఆ నిజాల్ని మన కళ్ల ముందు పడేసి మనమెంత గుడ్డోళ్లమో మన కళ్ళకు చూపిస్తాడు. అసలు నిజం ఇదా అని మనల్నిఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఒకసారి ఈ పుస్తకం చదివిన తర్వాత చీకటి గదిలో మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని , మనల్ని మనం ఒకసారిచీకటితో కడుక్కొని వెలుగులోకి రావలనిపిస్తుంది. మనుషులందరూ వారి మనసులను నగ్నంగా మన కళ్ళముందు ప్రదర్శించుకుంటూతిరుగుతుంటారు .ఆ నగ్నత్వాన్ని తట్టుకొనే మానసిక ధైర్యం నీకుందా !!నువ్వొక కొత్త మనిషిలా మారతావు,నువ్వొక ఋషివవుతావు .ఆ ధైర్యం నీకు లేదా, నువ్వు మనుషులను చూసి భయపడతావు . కానీఇంత నిజాయితీని చూశాక నీలో ఉన్న మనిషితనం నిన్ను భయపడేలా చెయ్యదు .
కొనకంచి గారి రచనలలో అధివాస్తవికత (సర్రియలిజం) చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది .
" కాలం నల్ల లాంతరు పట్టుకొని 
చీకట్లో చీకటినివెతుక్కుంటూ 
బయల్దేరినప్పుదు " 
"తేలు కొండికి ..పాము కోరకి 
ఉండేది ప్రేమే అయితే
విషమే ఈ ప్రపంచాన్ని కొనే 

అతి గొప్ప వస్తువు కదూ... " 
"జీవితమంటే ...అనేకానేక కనిపించని మరణాలు " 
"వెలిగే దీపానికి ...తైలం ..దూరంగా ఉన్నట్లు " 
ఇలాంటి భావనలు కొనకంచి గారికి మాత్రమే సాధ్యం.
కొనకంచి గారి మాటలు కొరకంచులు నిప్పుల్ని మండిస్తూ ..ఆ మాటలు ..మనల్ని దహించి వేస్తాయి . అవిమనల్ని నిద్ర పోనీయవు.నిద్రలో కూడా మనల్ని వెంటాడతాయి ,వేధిస్తాయి మరోసారి నిద్రపోనీయకుండా ,నిద్రపోతున్న వారికి వేడి సెగ పుట్టించి నిద్రలేపుతాయి . "కూయకుండానే తొలికోడిని కోసేసిన
ఊరికి వేకువ ఎలా తెలుస్తుంది ?? “
" దశాబ్దాలనుండి దేశం మీద ప్రేమతో
మరణించిన వీరుల అంతిమ ఆర్తనాదాలు 
ఈదేశంలోనే నవ్వులపాలవటం నీకు తెలీదు "

ఆరోగ్యశ్రీ లో లేని సరికొత్త రోగాలు 
తెచ్చుకొని అర్ధాంతరంగా చావాల్సిందే " 
అంటూ మాటలతో ఫైర్ పుట్టించగలటం ఒకకొనకంచి గారి పెన్నుకే సాధ్యం .
ఈయన కవితల్లో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి, సమాజం మీద కత్తులు విసిరేసి మేల్కొలపటం చాలా మంది చేసింది , కానీ ఈయనపువ్వులు విసిరి కూడా లేపగలడు . "నా కలల ..ఇంద్ర ధనస్సుపై
నువ్వు కుచ్చుల పరికిణితో 
పరుగెడుతున్నట్లు అవుతుంది "
" నా కంఠం చుట్టూ చేతులు వేసి 
యుగళ గీతానికి మొదటి చరణమై
నువ్వు ..సుందరమో..సుమదురమో 
అని చెవుల్లో పాట పాడుతున్నట్లే ఉంది "
ఇంత సున్నితమైన భావనలు కూడా అంతే సూటిగా, వాడిగా చెప్పటం చాలా కష్టం . 
కవితల్లో విషాదాన్ని నింపటంలో కూడా కొనకంచి గారిదిఒక ప్రత్యేక శైలి
"నువ్వు ఎక్కి వెళ్ళిపోయిన రైల్వే స్టేషన్ 
చివరన నేను సిగ్నల్ గా మారి 
నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను "
"నువ్వు గుర్తు రాగానే 
ఎమరాల్డ్ పెదవుల మీద
ఓ నవ్వు వెలిసినట్లు . 
హృదయాన్ని తట్టిలేపే పువ్వుల వానలో ..
.మైమరిపించే చిరునవ్వుల జడిలో ..
నేను జల జలా తడిసిపోతాను "
"నేను ప్రయాణించే రైలెప్పుడూ నిర్జనంగానే ఉంటుంది .
. ఆ రైలు లో నేనొక్కడినే సుదీర్ఘ ప్రయాణికుణ్ణి "
ఇలా విషాదాన్ని, విరహాన్ని కూడా కొత్తగా చెప్పగలగతాడు .
జీవితాన్ని మోడరన్ గా జీవించమంటూనే విలువలు మర్చిఫోవద్దు అంటాడు. నాగరికత విశృంఖులత్వానికి మొదట బలయ్యేది స్త్రీనే కాబట్టిజాగ్రత్తగా ఉండమమని హెచ్చరించే పర్ ఫెక్ట్ ఫెమినిస్ట్. మనుషులు స్త్రీ ,పురుషుల్లా కాక టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లా మారిపొతే సమాజం మొత్తంబాస్టర్డ్స్ తో నిండిఫొతుంది అని కటువుగానే చెప్తాడు .
ఒక అమ్మాయికి పురుషాధిక్య సమాజం నుండి ఎలా కాపాడుకోవాలో చెప్తాడు. సగటు మనిషిలో ఉందే హిపోక్రసీ ని ఎండగడతాడు. తన సొంత ఊరిని చూసి చిన్నపిల్లాడైపోతాడు,
అమ్మ చిన్నప్పుడు కప్పిన పాత చీరల బొంతని చుట్టుకొని తనకు తానే ధైర్యం చెప్పుకుంటాడు . స్నేహం పేరుతో జరిగే మోసాలు చెప్తాడులోకం తీరు ఎలా ఉందో తెలుసుకొని మసలుకోమంటాడు. మొత్తం మీద కవి సమాజానికి దిక్సూచి లాంటి వాడు అన్నట్లు ఈయన మత్రలిపిసమాజపు సంద్రంలో లంగరు వెయ్యటానికి వీల్లేని ఓడకు సరైన దిక్సూచి అవుతాడు, ఒక లైట్ హౌస్ అయి దారి చూపిస్తాడు యాదృచ్చికంగాజరిగిందేమో తెలియదు కానీ ఏ మంత్రమైన 108 సార్లు చదివితే చాలు అంటారు , ఇందులో సరిగ్గా 54 మంత్రాల్లాంటి కవితలున్నాయి.
ఇంత అద్భుతమైన కవితలను మనకందించిన కవి కొనకంచి గారికి ,శుభాభినందనలు

సమీక్షలు


కవిత్వం

భార్య

.......................
ట్రిబ్యూట్ టు ఏ ...వయిఫ్
.............
పురాతన శిథిల మానవ సమూహాల్లోంచి
ఓ ఆధునిక దివ్య మంత్రంలా
తాపసీక ..స్రుష్టి రహస్య అణువులన్నీ కూచోని
అస్థిత్వం కోసం పోరాడుతున్నఫ్ఫుడు ..
కనిపించని దివా..రాత్రి ..గతాల
అజ్ఞాతంలోంచి పుట్టిన...
యుగాల దాహార్తుల్లోంచి..మాత్రు బొధనల్లోంచి
పవిత్రత ..సవుశీల్యతలని
ఒక తరాన్నించి...మరో తరానికి
కానుకగా...జ్ఞాన సంపదగా ..దయివ్జాజ్ఞగా అందివ్వటానికి...
ఓ కొత్త ఊదారంగు ఆకాశంలా ..
ఓ కొత్త దివ్య గంధ పరిమళంలా..
అరి చేతిలో కురుస్తున్న తొలకరి కొత్త వానలా
అలా..అలా..అలా ..
నువ్వు పెళ్ళి పందిరిలోకి
అడుగు పెట్టావు .
శివధనుర్భంగానికి ముందు
సీతాదేవి రాముణ్ణి చూసిన తొలి చూపులా
జిలకర్ర ..బెల్లం నా తలమీద పెడుతూ
నువ్వు ..నా వయిపు చూసిన చూపుని
నిర్వచించి..వర్ణించటానికి ..నాదెగ్గిర మాటలు లేవే..
ఆ చూపులో..
వంద రకాల విద్యుత్ ఘాతాలు
ఆ చూపులో..
వంద రకాల..విద్యుత్ న్మాలలు.
అప్పుడే మలిసారి పుట్టిన
రెండు కొత్త శరీరాలమధ్య
అల్పపీడనం పుట్టినట్లు..
ఎంత వత్తిడి?ఎంత వత్తిడి?
పెళ్ళి సంకెళ్ళు వేసిన కొత్త బంధాల్లో
నీళ్ళయిపోయిన శరీరాలమీద
ఓడలు పరుగెత్తుతున్నట్లు
ఎంత బరువు?ఎంత బరువు?
చెప్పలేని అంతరంగ సందిగ్ధాలల్లో
చెట్లు మొలిచిన శరీరం మీద
సంజెవేళల్లో పక్షుల పాద ముద్రలని
మేల్కోని కనే కలలో
చిత్రంగా చూస్తున్నట్లు..భ్రమించటం
ఎంత స్రుష్టి వయిచిత్రం?
2 ..
నా లోపలి సముద్రపు హోరు
నాకే వినపడుతున్నఫ్ఫుడు ...
నాలోపలి తుఫాను రొద
నాకే తెలుస్తున్నప్పుడు..
శరీరం ..తెరుచుకున్న కిటికీలోంచి
ఒక ఒంటరి రెక్కల పక్షి నక్షత్రంలా ..
నా గదిలోపలి కొచ్చావు .వాలిపోయావు .
కలగన్న స్రుష్టి రహస్యాలన్నీ
ఒక్కసారే చేసిన దాడిలో..
ఇద్దరమూ గాయపడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో ఖేద పడ్డాము.
ఇద్దరమూ ప్రేమలో మోద పడ్డాము..
మొదటిరాత్రి..మనమున్న గది
స్రుష్టికర్త ప్రశ్న పత్రం అయ్యింది.
కుప్పబోసిన...అవ్యక్తాల్లోంచి
శరీరాలు నిర్వచనా లయ్యాయి
శరీరాలు జవాబులుగా కూడా మిగిలిపొయాయి.
3
మూడు ముళ్ళు ..ఏడు అడుగులు
ఒక్క రాత్రితో నేను..నీకు..
కొత్త ఇల్లుగా మారాను.
నువ్వు..నా నా కొత్త ఇంటికి
శుభ సూచకంగా పెట్టిన దీపంగా వెలిగావు.
నేను...నువ్వు పక్క మీదనించి లేస్తూనే
కళ్ళకద్దుకునే తాళిబొట్టు నయ్యాను.
నువ్వు వేసే ప్రతి అడుగులో నేనున్నానంటూ
నీ కాలికి మట్టెలు గా మారాను.
నువ్వు చేసే ప్రతి పనిలో నేనున్నానంటూ
నీ చేతులకి గాజులుగా మారాను.
ప్రపంచం చూసే నీ నుదుటన
నేనున్నానంటూ నీ బొట్టుగా మారాను.
రేపటి ..దేశం కంటున్న భవిష్యత్తుగా
చూస్తుండగానే తల్లిగా ..నువ్వు..
మన.. స్త్రీ పురుషుల జంటకి గుర్తుగా కొత్త జెండా నెగరేశావు.
ప్రపంచంలో..నా..కొత్త వారసత్వనికి.
నన్ను మూలపురుషుణ్ణి చేశావు..
4
గడ్డ కట్టిన ఓ అభేద్య నిశ్శబ్దంలో
పురుడు పోసుకోవటం అంటే
నువ్వు చచ్చి బ్రతకటమే కదూ..
అమ్మ కడుపులోంచి..కొత్త ప్రాణి
బయటి ప్రపంచానికి నిష్క్రమించటమే కదూ ..
ఆసుపత్రి బయట క్రూర నిరీక్షణల అనంతరం
మన ..ఇద్దరి..వారసత్వాన్ని
గుప్పిళ్ళల్లో..గట్టిగా ..బిగించి పట్టుకుని
నిద్దర బోతున్న
ఓ అందమయిన మానవపువ్వులా
మనబాబు...
ఓ అందమయిన వెల్తురు పక్షిలా
మన బాబు ..
నువ్విచిన నీ ..కానుకేగా నాకు..
5
అదే పురిటి వాసన ..
అదే ఆముదం వాసన..
అదే సాంబ్రాణి వాసన..
అదే పాలు తాగే బాల వాసన
తల్లిగా ..నిన్ను చూసినప్పుడల్లా
పాతచీర ..గుడ్డ ఉయ్యాలలో
నన్ను మాసాల పసిబాలుణ్ణి చేసి
జోలపాడుతూ ..లాలి పాడుతూ..
నన్ను కన్న తల్లి ..మరోసారి..భార్య ..నీ..రూపంలో ..
నన్ను నిద్ర బుచ్చటానికొచ్చినట్లు కనిపిస్తుంది.
నీకంటూ ..నీకు నువ్వు ఏమీ మిగుల్చుకోకుండా
నీ ఇంటి పేరు కూడా మార్చేసుకున్నావు.
వేడి అన్నం మీద పడ్డ ..వెన్న ముద్దలా
నీ..నెత్తురు వెచ్చించి..
మా జీవితాల అగ్గిలో కరిగిపోయావు.
శుక్రవారం నాకంటే ముందే లేచి తలంటు పోసుకున్న
నా కొత్త ఉదయాని వయ్యావు.
శని వారం రోజున
నా ఒక్క పొద్దువి కూడా అయ్యావు .
ఇంటి ముందు పూల చెట్టువయ్యావు.
రోటి దెగ్గిర పచ్చడివయ్యావు .
పొయ్యిదెగ్గిర బొగ్గుగా మారిన కట్టె ముక్క వయ్యావు
దాహాని తీర్చేందుకు మట్టికుండగా మారావు
పండగ రోజున ..నాకూ ..పిల్లలకు..
కంచాల్లో పరవాన్నం అయ్యావు.
అమ్ముమ్మ వయ్యావు ..నానమ్మ వయ్యావు.
మనుమళ్ళకు..మనుమ రాళ్ళకు
కథలు చెప్పే చందమామ పుస్తకమయ్యావు .
6
జీవితం ...కత్తుల వంతెనమీద
నేను చేస్తున్న యుద్ధంలో..
యెప్పటికీ ఖాళీ కాని అమ్ముల పొదిలాగా
మారిపోయిన నీకు ..
నేను..క్రుతజ్ఞతలు మాటల్లో చెప్పాలంటే ..
నాకు రావణాసురుడిలా పది తలలు కావాలి.
చేతులు మోడించి క్రుత్జతలు చెప్పాలంటే
ఇరవయి చేతులు కొత్తగా మొలవాలి.
దేహం నించి..దేహానికి సాగిన ప్రయాణం అల్లా..
రూపాన్ని మార్చుకోని
ఆత్మ నించి ఆత్మకు ప్రయాణం
గా రూపాంతరమయ్యింది.
జీవితాన్ని నిర్వచించిన
నిబంధనలన్నీ చూస్తుండగానే గాలిలో కలిసిపోయాయి
బతుకు పోరులో ఎదురయిన
సంకెళ్ళన్నీ చూస్తుండగానే ముక్కలుగా విరిగిపొయాయి.
ముసలితనం తెచ్చిన స్వేచ్చలో
కాటికి కాళ్ళు జాపుకోని ..
ఏ బాదర బందీలేకుండా
చావుకోసం ఎదురు చూడటం
ప్రతిమనిషికీ ఆఖరి దశలో ఎదురయ్యే ఎంతటి నిత్య సత్యం??
7
ఎవరో వస్తున్నారు..ఎవరో వెళ్తున్నారు..
ఎవరో నన్ను..మంచం మీదనించి కింద పడుకోబెట్టమంటున్నారు ఏవేఓ అస్పస్ట ద్రుశ్యాలు..అస్పస్ట వాసనలు
అదిగో ..నా భార్య ..కొత్తపెళ్ళికూతురుగా వస్తున్నది..
అదిగో ..మా అమ్మలాగే ..నాకు అన్నం తినిపిస్తున్నది..
నా కొడుకులు..కోడళ్ళు వద్దు వద్దు..
అది ఎక్కడున్నది?ఎమేవ్?ఒసేయ్..ఎక్కడున్నావు..
నాకు అమ్మ వాసన వస్తున్నది
నాకు భార్య వాసన వస్తున్నది..
ఎవరో తులసితీర్ధం పోయమంటున్నారు..వినపడుతున్నది..
అతికస్టం మీద చూస్తే నా భార్య ..ముసలిది..ఏడుస్తూ.
నా నోరు తెరిచి నీళ్ళు పోస్తున్నది.
ఏడ్వబాకే ..ఏడవ బాకు ..
నీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నాను.
వచ్చే జన్మంటూ ఉంటే..
నీకు కొడుకుగా పుట్టి ..
నీ పయిట చెంగుతో ఆడుకుంటూ ...నీ పాదాలదెగ్గిర అంబాడుకుంటూ
ఈ జన్మలో భార్య రుణం ..
వచ్చేజన్మ లో అమ్మ ..రుణం..
ఒక్కసారే తీర్చుకుంటాను .
..................................................................

సమీక్షలు

ఒక
యుద్ధస్వరం కొనకంచి “మంత్రలిపి

సారంగ సాహిత్య వారపత్రిక నుంచి
ఎం. నారాయణ శర్మ రాజ్యం ఉనికిలోనుంచే,సమాజం ఉనికిలోనుంచే కొన్ని అపసవ్యదిశలున్నాయి.కాని ప్రపంచీకరణ తరువాత దీని భీకర రూపం ప్రభావం ఎక్కువ.ఈ పరిణామాలతరువాత మనిషి కేవలం ఆర్థికమానవుడుగా ఇంకాచెబితే, కేవలం సాంకేతికమానవుడుగా తయారయాడు.ఈ పరిణామాలు,పరిణామాలఫలితాలు ఈకాలపు కవిత్వంలో ప్రతిఫలిస్తున్నాయి.వస్తుగతంగా “కొనకంచి”-మంత్రలిపి”కూడా దీనికి మినహాయింపుకాదు.కాని కవిత్వంలో కనిపించే సంవేదనాంశానికి,అస్తిత్వజిజ్ఞాసకు,ఈకవిత్వంలోఉండే భావావేశతీవ్రతకు మధ్య చెప్పుకోదగ్గ వైరుధ్యాలున్నాయి.వాక్యాల్లో ప్రస్ఫుటంగా వర్గస్పృహకాకుండా విశ్వాత్మలో చెల్లుబాటయ్యే సార్వజనీన తిరస్కరణనుచూడొచ్చు.
రాజ్యం యొక్క పట్టించుకోని తనాన్ని,లంచగొండితనాన్ని,స్వార్థంలాంటి అంశాలపై కవిత్వం రాసినా ఈవాక్యాలవెనుక ఉనికిసంబంధమైన పోరాటం ఉంది. రాజ్యపులక్షణాలను,రాజ్యం,ప్రపంచీకరణ రెండూ ప్రసారం చేస్తూ మానవీయమూలాలుదెబ్బతీసే ప్రతివ్యక్తీ,అంశం ఈకవిత్వంలో తిరస్కరింపబడుతాయి.అందులోనూ రాజ్యాన్ని ప్రథమశత్రువుగా చూడడం ఇందులో గమనించవచ్చు.అనేక కవితలు అందుకు నిదర్శనం కూడా.కొన్ని కవితల్లో భారతీయ సంస్కృతి,సంప్రదాయాలనుగురించి మాట్లాడటమూ గమనించవచ్చు.జీవితం పోరటమైన సందర్భాలలో మానవుని అస్తిత్వాన్ని గురించి” మంత్రలిపి” ఆలోచిస్తుంది.
అంశాత్మకంగాచూస్తే మానవీయలక్షణాల అణ్వేషణ,దానికి కారణాలను,కారకులను తిరస్కరించడం,క్షేమాన్ని కనిపెట్టాల్సిన రాజ్యపు స్వభావాన్ని,అందులోని దుర్నీతిని తిరస్కరించడం ప్రధానంగా ఎక్కువకవితల్లో కనిపిస్తుంది.

ప్రియురాలి హృదయంలో ప్రేమలేదు
ఉన్నదంతా ఒక అవసరం
ప్రియునిమనసులో ప్రేమలేదు
ఉన్నదంతా పచ్చిదేహభాష

నెచ్చెలిని కౌగిట్లోనిద్రపుచ్చే
మంత్రగాడిలా మారాలనుకున్నప్పుడల్లా
చీకటి పడీపడకముందే
తొలికోళ్ళు కూస్తున్నాయి

స్నేహాన్నినటిస్తూనే
నాకుతెలియకుండా నన్ను  ప్లాస్టిక్ పువ్వును చేసి
బతుకు పుస్తకంలో ఉన్న ఆఖరి రక్తమాంసాలని
ఎవరో ఎత్తుకుపోయారు“–(మంత్రలిపిపే.21/22)

ఈవాక్యాలన్నీ జీవితవిలువల్లోని చరమస్థాయిని చిత్రిస్తున్నాయి.మొదటివాక్యం జీవన సంబంధాలను ,రెండవవాక్యం బంధాలు దూరమవుతున్న క్రమాన్ని,మూడవభాగం మోసపోతున్న జీవితాలను వ్యక్తం చేస్తాయి.ఇవన్నీ జీవితపు విలువలను వ్యక్తం చేసినా వీటివెనుక ప్రపంచీకరణప్రభావాలను పరోక్షంగాప్రస్తావిస్తాయి.కేవలం అవసరంగామారడాన్ని,సమయంలేకపోవడాన్ని,మేలుచేస్తున్నట్టుగా కీడుచేయడాన్ని ఈవాక్యాలు గుర్తించాయి.నిర్మాణగతంగా ఇవి వస్తువుయొక్క సంవిధానస్థాయిని(the proairetic code) చెబుతాయి.ప్రపంచీకరణ నీడను గుర్తించడానికి ఈవాక్యాలు దోహదం చేస్తాయి.నిర్మాణగతంగా పూర్తిసమాజాన్ని చిత్రించే సంపూర్ణత్వం(Wholeness)దాన్ని అర్థంచేసుకోడానికి గతవర్తమానాలను పరిచయం చేసే పరిణామశీలం(Transformation)ఈ కవితల్లో కనిపిస్తాయి.వీటన్నిటి వెనుక రాజకీయస్పృహ గమనించదగింది.కొనకంచి వాక్యాలన్నీ రాజ్యాన్ని దాన్నీఅనుకొని ఉన్న స్వార్థాన్ని,దోపిడీని ఎక్కు పెట్టేవే.
ఉన్మాదుల..పాలకులచేతుల్లో/మనుషులజీవితాలన్నీ/రాళ్ళు రప్పలపాలయినప్పుడు/అధికారమే మారణాయుధాలతో/తనమనుషులను తానే చంపటానికి దండెత్తినప్పుడు/
మనుషులంతా నీళ్లలో తిరిగే చేపలవుతారు/తమప్రాణాలను కాపాడుకునేందుకు/తామేవెళ్ళికనపడుతున్న/నైలాన్దారాల్లో దాక్కుంటారు
 చుట్టూ ఉన్న ప్రపంచంలో/మనుషులంతా నడిచే నల్లనాగులుగా మారినప్పుడు/గుడ్డుగుడ్డులాగేఉంటుంది/గుడ్డులో పచ్చసొనమాయమవుతుంది/మనిషి మనిషిలాగే ఉంటాడు/మనిషిలో మనిషిమాయమవుతాడు/రాజ్యాంగం రాజ్యాంగం లాగే ఉంటుంది/రాజ్యాంగంలో అన్నీ తెల్లకాగితాలేమిగులుతాయి. -(మంత్రలిపిపే.23/24)
చట్టబద్ధంగా రాజ్యంచేసే హత్యలకు/అసలుహంతకులు/రాజ్యాంగం పేజీల్లోనే/అక్షరాలయిదాక్కున్నారు“-(పే.41.ఇది హత్యాత్మహత్య)
kona1
మొదటివాక్యం ప్రజలు తమకు తాముగానే (విధిలేని పరిస్థితుల్లో) బలి అవడాన్ని,రెండవ వాక్యం ప్రజలను బలితీసుకుంటున్న విధానాన్ని చెబుతుంది.ఇందులో రాజ్యం యొక్కప్రవర్తన గుర్తించడంలో కొనకంచిలో విప్లవచాయలున్నాయి.రాజ్యాంగంపైన దేశంలోని రాజకీయపార్టీలు సైద్ధాంతికంగాకానీ,ఆచరణరీత్యాకానీ,మానసిక ప్రవృత్తులవలనకానీ కట్టుబడిఉన్నాయన్న దాఖలాలు లేవు.అంతేకాక ప్రపంచీకరణలోని ప్రధానాంశం ప్రత్యామ్నాయ ఆర్థికవిధానాల అభివృద్ధి(Development group for attentive policies)కి ప్రధానవాహికగా ఉన్నాయి.చిల్లరవర్తకాలపై పెట్టుబడులనాహ్వానించిన మొన్నటి కాంగ్రెస్ నుంచి,ఇప్పటివరకు ఉన్న రాజ్యాలన్నీ దీనికి మినహాయింపుకాదు.స్వాతంత్రాన్ని సంపాదించుకున్న చైతన్యం ఇలా వట్టిపోయిందనే అనాలి.కాడ్వెల్-ఒకమాటంటాడు.
 Consciousness is generated by men’s Active struggle with nature and perishes in a blind formalism once that grapple ceases
 (చైతన్యం ప్రకృతితో జరిగే మనిషిక్రియాశీలపోరాటం నుంచి పుడుతుంది.ఒకసారి అనుకున్నది సాధించాక ఆచైతన్యం ఒక గుడ్డి వ్యవస్థగా మారి నశిస్తుంది-(Illusion and Reality-పే 63).
వర్తమానస్థితిని చెబుతున్న కొనకంచివాక్యాలసారాంశమూ ఇదే.ప్రాచీనభారతీయ రాజనీతిశాస్త్రం రాజును రాజ్యాన్ని ఆరాధించే ప్రజలగురించి ప్రస్తావించింది.

ధార్మికం పాలనపరం సమ్యక్పరపురజ్ఞయః
రాజానామభిమన్యంతే ప్రజాపతిమివప్రజాః
 ఈలక్షణాలు లేని ధార్మికత్వం,ప్రజాగతపాలన లేనిరాజ్యాన్నే మంత్రలిపి నిలదీస్తున్నది..వస్తుగతంగా ఉద్వేగమున్నా కవిత్వీకరణలో హృదయాన్ని హత్తుకోగల కళాంశాలనేకంగా ఉన్నాయి.
 కాలం నల్లలాంతరుపట్టుకొని/చీకట్లో చీకటిని వెతుక్కుంటూ/బయల్దేరినప్పుడు“-(పే.37.అప్పుడుఎప్పుడో ఒకసారి)
 తనకంటే ముందుగా/తనచావే పుట్టిందని
ఇప్పటివరకు/ రైతూ గుర్తించలేదు“-(పే.42.ఇది హత్యాత్మహత్య)
 ఇలాంటివాక్యాల్లోని సంకేతాలు కళాదృష్టిని ప్రసారం చేయడమేకాకుండా వాస్తవికతను బలపరుస్తాయి.ఈ సంపుటిలో ఇలాంటివాక్యాలను అనేకంగా ఎత్తిరాయొచ్చు.ఇవన్నీ వాస్తవాన్ని ప్రతిఫలిస్తాయి.వర్తమాన రాజకీయ,సామాజిక పరిస్థితులపై  గొంతెత్తిన యుద్ధస్వరం కొనకంచి మంత్రలిపి.
                                                                   ___________  

సమీక్షలు

 నిప్పులను వెదజల్లే అక్షరాల లిపి !!

 మాలిక పత్రిక నుంచి

సమీక్ష: పుష్యమీ సాగర్
manthra ilpi
మంత్ర లిపి కొన్ని సంవత్సరాల తపస్సు తరువాత వెలుగు చూసిన అక్షరాలు. చీకటి రాజ్యం పై దండెత్తిన కరవాలం. నిజం నిప్పు అయితే దాన్ని పట్టి చూపించే దమ్మున్న అక్షరాల సుమం ఈ మంత్రం లిపి. కొనకంచి లక్ష్మి నరసింహ గారు మంచి కధకులు, నవలాకారులే కాదు మంచి కవి కూడా. మొత్తం 54 కవితలలో తర తరాలు గా సాగుతున్న మానసిక బానిసత్వపు సంకెళ్ళని, పుచ్చిపోయిన రాజకీయ వ్యవస్థ ని కడిగిపడేసే కవిత్వాన్ని ధార గా అందించారు. ప్రజల జీవితాన్ని రాజ్యం యుద్ధం లో కి తోసినప్పుడు సైనుకుడి లా పోరాడాలి అంటారు. నాశనమైన మానవత విలువ లకి చిరు దీపమై నిలుస్తాను లిపి సాక్షి గా.. అని అన్యాయం పై తిరుగుబాటు జెండా ఎగరేసారు. చావు బతుకుల మధ్య ఓ చిన్న విరామ చిహ్నమే ఈ జీవితం, అంతటి వైరాగ్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాడు అనుభవించాల్సిందే. నీతులు ఒకరికి చెప్పి తాము ఆచరించకపోవడంలో ఉన్న మతలబును “అజ్ఞాతం గా మనుషులంతా అణగారిన చోట” లో బాగా వివరిస్తారు.
ప్రొఫెసర్ కొడుకు పక్కా క్యాపిలిస్ట్ గా మారేందు కు విదేశాల్లో చంపుడు చదువులు చదువుకుంటే, దాస్ కాపిటల్ అబద్ధపు పుస్తకం అవుతుంది, ఇలా హిపోక్రసి ని నిలదీయగల దమ్ము సగటు మనిషి కి వస్తుందా…? లలో కత్తిని, పువ్వు ని రెండూ ఒకేసారి ఉపయోగించడం బహుశ మొదటి సారి చూస్తాం. ఓ పక్క సామాజిక అంశాలపై తమ గళాన్ని వినిపిస్తూనే మరో పక్క ప్రేమ భావన ని అనుభవిస్తారు. ఓ చోట ఎంత బాగుందో “నీ కోసం నేను సృష్టించుకొన్న వర్ణ ప్రపంచం లో నా అక్షరాలన్నీ, ఉయ్యాలలో ఊగుతున్న పసిపాపలు అయ్యాయి ” అని చెప్తూనే తన కోసం బ్రతకటం స్వప్నం అయినప్పుడు నా ప్రపంచమంతా ఉద్యానవనమే అంటారు. “నీ కోసం బ్రతకటమే ఓ స్వప్నమైనప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కో ఉద్యనవానమే కదా..(నువ్వు ఎవరు అనుకుంటున్నావు ?). ఇక “మంత్ర లిపి ” లో అమ్మక ద్రోహం మా ఇంటి పేరు , లంచం మా జన్మ హక్కు, అవినీతి మా జాతీయ సంపద, దేశం అంటే ఉత్తి నల్ల మట్టి, మనిషంటే పిడికెడు బూడిద మాత్రమే” ఈ దేశం లో పాతుకు పోయిన అవినీతి జాడ్యానికి సగటు మనుషులు అందరూ మట్టి లో కలిసి పోయారు …నిజమే దేశం అంటే ఇప్పుడు మట్టి మాత్రమె, మనుషులు కొట్టుకు పోయారు అవినీతి వరదల్లో.
ప్రజల అమాయకత్వాన్ని దోచుకొని కోట్ల కు పడగలెత్తిన నాయకుల వైఖరి ని చూస్తున్నప్పుడు ప్రతి రోజు కూడా ఒక దగ్ధ గీతం లాగానే అనిపిస్తుంది. రాజకీయ నాయకుని చేతి లో దేశం కాని, రాష్త్రం కాని ఎలా ఆట ఆడించే జంతువు గా మారిన క్రమాన్ని అక్షరాల్లో చదివినప్పుడు రక్తం మరుగుతుంది . ఓటర్లు కు తెలియకుండా వాళ్ళ ప్రాణాలని లాగేసుకుంటే, ప్రాణం లేని మనుషులు తమ ప్రాణాలెక్కడున్నాయా అని విలపిస్తే, ఐదేళ్ళ పాటు రాజ్యం మీద పడి వెతుక్కుంటూ వుంటారు. సగటు ఓటరు పరిస్థితి ని కళ్ళకు కట్టినట్టు చూపించలేదు. తిరిగి రాని వసంతం లో తన నుంచి దాటుకు పోయిన బాల్యాన్ని, నాన్న పంచిన అనుభూతులను గుర్తు చేసుకుంటూ “నేను దిద్దిన ఒనమాల పలక ఏ ద్వీపం లో ముక్కలు అయ్యిందో” అనుకోని కూడా అవి అవధులని దాటి ప్రపంచం మొత్తం విస్తరించడం బాగుంది అంటారు. పేదోడు కులం ఏమిటి ఆకలే, …అలాంటి పేదోళ్ళ కులం మేమంతా ఒక్కటే . డబ్బున్న వాడు పవ్మేంట్ మీద వాహనం తో తొక్కించినప్పుడు ఎవడికి చెప్పుకుంటారు వారి వేదనని? అది తన అక్షరం గా మలిచారు రచయిత. “పుట్ పాత్ అంటే సజీవత్వం అంతు దొరకని నవ్యత్వం, ఒకానొక నిండు చైతన్యం,” అని వాళ్ళని దగ్గరకు తీసుకున్నారు. పుట్ పాత్ మీద బ్రతికే జీవులు గొప్పగా పోరాడే యోదులే అని నిర్ధారిస్తారు . “దేశ సరిహద్దుల్లో సైనికుల లాగానే పుట్ పాత్ ల మీద బ్రతుకు యుద్ధం చేస్తా రు”. క్రింది స్థాయి ప్రజలకు కూడా హక్కులు ఉంటాయి అన్న నిజం గుర్తుకు రాకపోదు (అవును మేమతా ఒక్కటే ).ఈ దేశం అవమానించ బడటం క్రొత్తేమీ కాదు. అలాగే ప్రజలు కూడా …మరుగు దొడ్లు కడిగేందుకు పనికి రాని మేధావులు వికృతమైన ఆలోచనలతో పెడ త్రోవ పట్టిస్తారు. వీటిని ఖండించిన తీరు అద్భుతం (నిన్ను నేను క్షమించను ) ..”ఇది రాత్రి కాదు” లో అమ్మటం కొనటమే తెలిసిన చోట కవిత్వమేమిటి, జీవితమేమిటి , అని వైయుక్తికం గా ప్రశ్నిస్తారు .
ఇప్పుడు పసి పిలలు, యువతులు అని తేడా లేకుండా ఆడ పిల్ల అయిన పాపానికి అత్యాచారాలకి ఘోరాలకి బాదితులు గా నిలబడటం నడుస్తున్న చరిత్ర ..గొప్ప దేశం లో ఆడ పిల్ల భద్రత అన్నది నీటి బుడగనే తల్లి అంటూ దేశం లో ఆడపిల్ల పై జరుగుతున్న దారుణాలని ఎండగడతారు
యుక్త వయసు నీకు పెరుగుతూ ఉంటే అమ్మ కొంగు లో కార్చిచ్చు ఉన్నట్లు, అర్థ రాత్రుళ్ళు ఉలిక్కి పడి నిద్ర లేచి నిన్ను చూసుకునేది అంటే ఇంట్లో వున్నా కూడా ప్రతి తల్లి కి భయమే నిజమే. నీకు తెలియదు అమ్మా… మనషులు ఎప్పుడో జంతువులు అయిపోయారు అంటూ మనిషి లో ని కాముకత్వం ఎంతటి క్రూర ప్రవృత్తి ని పెంచుతుందో చెప్పకనే చెప్పుతున్నారు ..(ఓ అమ్మాయీ అమేలియా ). తనని తన అక్షరాలని అక్కున చేర్చుకొని ..కవిత్వ దారలో ముందుకు తీసుకువెళ్ళిన రచయతలను ..తన కంటే ముందు తరం వాళ్ళని గుర్తు చేసుకునే క్రమం గొప్ప గా ఉటుంది.
“చాక్ పీస్ చిత్రాల్లా”, “కలాల తోటి”, “అబ్బో….నన్ను ఆకాశం లో కి చెయ్యెత్తి మరి ఆహ్వానించారు (నా ముందు తరం రచయతలు)”, “అపుడెప్పుడో దశాబ్దాల క్రితం నా ఉడుకు వయసు లో నువ్వు వేసిన గాలానికి చేపలా తగులుకున్న నేను అరవై ఏళ్ళు వచ్చినా ఇంకా గిల గిల తన్నుకుంటూ వున్నాను” అని గతంలో ప్రేమ తాలూకు విషాదాన్ని మననం చేసుకుంటారు ..(నువ్వు, నేను, మన ప్రేమ).
కడుపు నిండా అన్నం పెట్టె రైతు నేడు ఆత్మ హత్య చేసుకోవాల్సిన స్థితి కి ఎందుకు దిగజారింది, దేవుళ్ళందరూ వున్నా ఇక్కడమనిషి కరువంటారు. రాజ్యాంగం అబద్దమైన చోట, బతుకులు అబద్దమైన చోట దేశం మాత్రమే నిజం అంటారు..
రైతు పండించే ధాన్యం నిజం, రైతు మాత్రం అబద్దం నిజమే …బువ్వ ని అందించే రైతు అబద్దం. ఈ దేశం లో అనే కవిత లో “నాయకుల ఇంట వెలుగుతున్న లాంతర్లలో ఇంధనం గా వెలుగుతున్నది చచ్చిపోయిన రైతు రక్తమే” ఎంత దారుణం, . అలాగే, “నేను అన్నం తిందాము అనుకుంటున్న ప్రతీసారి నా కంచం లో ఏ కన్న తల్లివో రెండు కన్నీటి బొట్లు జారి పడి మెరుస్తున్నాయి, నా కంచం లో ఆత్మ హత్య చేసుకున్న ఏ రైతు భార్య వో రోదిస్తూ తెగిపడ్డ పుస్తెలు కనిపిస్తున్నాయి, అనడం వెనుక ఎంత వేదన వున్నది !! చివరికి ఈ రైతు చచ్చిపోవడం అంటే దేశం చచ్చిపోవటమే, రైతు చచ్చిపోవటం అంటే రేపటి తరాలు చచ్చిపోవడమే (ఇది హత్యాత్మ హత్య )
తను ఎంతో ప్రేమించినవాడిని దేశం కోసం త్యాగం చెయ్యాల్సి వస్తే ఆ ఇంతి మనసు ఎలా తల్లడిల్లుతుంది ..”అదేంటో కళ్ళు మూసుకుంటే అన్ని రాకూడని కలలే వస్తాయి, కలలో ఎవరో తెల్ల చీర కట్టినట్టు కనిపిస్తుంది. చేతి గాజులను పగలగొట్టినట్టు అనిపిస్తుంది” అని ఆ వీరుడి భార్య దు:ఖిస్తూ ఉంటుంది (ఏమండీ ప్రియమయిన మీకు). ఇదే కవిత లో పోరు ముగిసాక ఈ రాజ్యానికి మనం ఎవరు? పోరు ముగిసాక మనం దిష్టి బొమ్మలు గా కూడా పనికి రామన్న నిజాన్ని వీరులు ఎందుకు గుర్తించరో అని వాపోతారు. దేశం వీరుల చావులని తమ స్వార్ధ ప్రయోజనాలకి వాడుకొని తరువాత మర్చిపోవడం కొత్త విషయము ఏమి కాదు కదా.
ఇంకా ఇందులో “కళ్ళు”, “చీకటి లో చీకటి “, “అనుభూతి ఒక శాపం” “నిన్నెలా మరువను” , పొగడరా “నీ తల్లి భూమి భారతి ని”, “అవును మేమంతా ఒక్కటే ” లాంటి మంచి కవితలు వున్నాయి. నేను పేర్కొన్న వి కేవలం కొన్ని మాత్రమే. ఒకసారి ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకొని చదివిన తరువాత మనలో కలిగే భావ సంఘర్షణ ని అడ్డు కట్ట వెయ్యడం అసాధ్యమే. కొనకంచి గారి కవితలు చాల వరకు సామాజికం గాను, వైయుక్తికం గాను, స్పూర్తిని నిమ్పేవి గాను మనకు కనిపిస్తాయి. ప్రజల పక్షాన నిలబడే రచన ఎప్పుడు పది కాలాల పాటు నిలుస్తుంది. ఆ కోవ లో కి ఈ “మంత్రం లిపి ” వస్తుంది అందు లో ఎలాంటి సందేహం లేదు ..